శ్రీ కృష్ణావతారం 5

శ్రీ కృష్ణావతారం 5

దేవకి కృష్ణుని కనుట

పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్రసవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలుతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు.శ్రేష్ఠులైన గంధర్వులు (నారద, చిత్రసేనాదులు) దివ్యగానాలు చేసారు; రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేసారు; సిద్ధులు అనే దేవతలు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు; చారణులు అనే దేవతలకు భయం తీరి ఆనందించారు; దేవతలు ఉత్సవంగా భేరీలు మోగించారు;అలాంటి సమయంలో:దేవకీదేవి అర్థరాత్రి వేళ నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా, రాక్షసులను శిక్షించేవాడు; ఆశ్రయించినవారి ముఖాలలో ఆనందం నింపేవాడు; జయశీలము గలవాడు; విశ్వం అంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీమహావిష్ణువును ప్రసవించింది.

ఓ పరీక్షిన్నరేంద్రా! శ్రీ మన్నారాయణుని ప్రసవించి దేవకి మెరుపు తీగలా మెరిసి పోతూ మిక్కిలి అందంగా ఉన్నది; ఆ సమయంలో, దేవకి నిండు పౌర్ణమినాటి పదహారు కళలతో నిండిన చంద్రుని కన్న తూర్పు దిక్కు అంత అందంగా ఉంది.అప్పుడు

ఆ బాలుడు దివ్యరూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగి ఉన్నాడు; (మోకాళ్ళ వరకు) పొడవైన నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి; తామరరేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి; కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సగుణాల పోగు; అతి విశాలమైన కరుణ కలవాడు; వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి, ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి, ఉబ్బితబ్బిబయ్యాడు.స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనంద రసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు "పదివేల ఆవులు దానం చేస్తున్నాను" అని మానసికంగా ధారపోసాడు.ఇంకా వసుదేవుడు.ఇంకా వసుదేవుడు “పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే.” అని అనుకొన్నాడు.

వసుదేవుడు కృష్ణుని పొగడుట

భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేసాడు. లేచి రెండు చేతులనూ తామర మొగ్గల వలె నుదురు పై జోడించాడు. పసి పిల్లాడు అని వెనుదీయకుండా అతని దివ్య చరిత్రలు అన్నీ తలచుకొని పొగడసాగేడు.స్వామీ! నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింప జేస్తావు; ఙ్ఞానము ఆనందము కూడిన స్వరూపుడవు; నీవు శాశ్వతుడవు; ఎవరి అదుపాఙ్ఞలకు నీవు లోబడవు; మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది; అట్టి నిన్ను నేను కన్నానట; ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉందా? నీ మాయను చక్కగా నీ నుండి వెలువరచి సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలుగా విస్తరింపజేస్తావు. ఆ మూడు గుణాలతోను జగత్తులన్నీ సృష్టింపబడుతాయి. త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి. కనుక సృష్టిలో ప్రవేశించడం ఉండదు. అలా అని ప్రవేశించక పోవడమూ ఉండదు.అది ఎలాగ అంటే, సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మ శక్తులన్నీ కలిసి నీకు విరాట్ అనే పేరుగల శరీరం నిర్మిస్తాయి. అలా నిర్మించడానికి పదహారు వికారాలు అనబడే ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మ శక్తులు కలసిపోతాయి. ఆ విరాట్ అనే శరీరం నీకు విస్తరించడానికి అవసరమైనది. ఆ నీ శరీరం సృష్టికి ఆధారమైన మహత్తు మొదలైన ధర్మాల వంటిదే గాని, వానికన్న వేరుగా కూడా ఉంటుంది. ఆ శరీరంలో నీవు ప్రవేశించి ఉండి, దానికి అతీతంగా కూడా ఉంటావు. ఎందుచేతనంటే అది నీ శక్తి అనే నీటి నుండి తయారైన బుడగ వంటిది. నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందు వలన విరాట్టులోనికి నీవు పుట్టడం ఉండదు. మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఈ విధమైన ఙ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మశక్తుల ఆధారం లేకుండానే నీవు జగత్తులో నిండి ఉండి కూడా దానితో కలవకుండా ఉంటావు.
షోడశవికారములు {షోడశవికారములు = ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము)- - - - మరొక విధము - - -
షోడశవికారములు = పంచప్రాణములు (5) అంతఃకరణ (1) ఙ్ఞానేంద్రియములు (5) కర్మేంద్రియములు (5) షోడశమనోవికారములు= 1 కామము 2 క్రోధము 3 లోభము 4 మోహము 5 మదము 6 మాత్సర్యము 7 రాగము 8 ద్వేషము 9 ఈర్ష్య 10 అసూయ 11 దర్పము 12 దంభము 13 భయము 14 అహంకారము 15 స్వప్నము 16 భ్రాంతి అనే పదహారు మనోవికారాలు.
షోడశకళలు = పంచఙ్ఞానేంద్రియములు (5); పంచకర్మేంద్రియముల (5); మనస్సు (1);పంచేంద్రియార్థంబులను (5)--- మొత్తము 16 --- షోడశకళలు గలది లింగశరీరము
షోడశోపాధులు = పంచఙ్ఞానేంద్రియములు (5); పంచకర్మేంద్రియముల (5); మనస్సు (1);పంచేంద్రియార్థంబులను (5)--- మొత్తము 16 --- పదిహేడవది (17 వది) జీవుడు 
ఏకాదశేంద్రియములు = [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి]
చతుర్దశేంద్రియములు = కర్మేంద్రియములు (5) ఙ్ఞానేంద్రియములు (5) అంతఃకరణ చతుష్టయము (4) అంతఃకరణచతుష్టయము =
1 మనస్సు సంకల్పము
2 బుద్ధి నిశ్చయము
3 చిత్తము చింతనము
4 అహంకారము అహంభావము
పంచకృత్యములు =
1. సృష్టి
2. స్థితి
3. లయము
4. తిరోధానము
5. అనుగ్రహము}

సర్వమునకు ఈశ్వరుడైన భగవంతుడా! సర్వము నీ లోనే ఉంది; సర్వమునకు ఆత్మ అయిన వాడవు నీవు; నీ చేత తయారైన వస్తువులతో సర్వము నిండి ఉన్నది; అట్టి నీకు లోపల, మధ్య, బయట అన్న బేధాలు లేవు. ఈశ్వరుడా! ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి పుట్టు కొస్తాయి. వాటిని ఆత్మ కన్న వేరైనవి అనుకొనే వాడు పరమ మూర్ఖుడు. విశ్వమంతా నీవే. నీవు కానిది వేరే ఏమి లేదు. అంతే కాకుండా. ప్రభువా! నీ వలన జగత్తు పుడుతుంది. అయితే ఆ జగత్తుకు అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరిక కూడ నీకు లేదు. నీ వలననే పుట్టిన జగత్తు నీ వలననే వృద్ధిచెంది నీ యందే లయమౌతుంది అనడం పొరపాటు కాదు. సర్వాతీతుడవై, బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు అని నీ ఆఙ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యం అని ప్రసిద్ధికెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడిన గుణాలు, వాని గొప్పదనాలు నీవిగా తోస్తాయి. నీవు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఎఱ్ఱని రంగుతో కూడి ఉంటావు. సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పుడు తెల్లని రంగుతో కూడి ఉంటావు. తమోగుణ రూపుడవై సృష్టిని లయంచేస్తూ ఉన్నప్పుడు నల్లని రంగుతో కూడి ఉంటావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే ఇవాళ కూడ దుష్టులను దండించడానికి భూమి పై మానవుడుగా అవతరించావు. ఆకాశవాణి మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నువ్వు నా యింట పుట్టబోతున్నావని భయపడి, వాడు నీ అన్నలను అందరిని సంహరించాడు. ఇప్పుడు నువ్వు పుట్ట బోతున్నా వని తెలిసి కంటికి కునుకు లేకుండ ఉన్నాడు. నువ్వు పుట్టావని కారాగార భటులు చెప్తే తాత్సారం చేయడు. వెంటనే నీ మీదకి విరుచుకు పడటానికి సిద్ధమై వచ్చేస్తాడు.” ఇలా వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవి కొడుకును చూసింది. అతడు మహాపురుషుల సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులు కలవాడు, చాలా సుకుమారుడు అయ్యి ఉన్నాడు. కంసుని పేరు వినబడగానే దేవకీదేవి భయపడింది. శుచి అయి చక్కటి చిరునవ్వు కలది అయి ఆ దేవదేవుని వంక చూసి ఇలా అంది.



 దేవకి చేసిన స్తుతి

“బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తైన పిమ్మట స్థూలమైన పంచమహాభూతాలు అహంకార మనే సూక్ష్మ భూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమౌతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వం లోనికి లీనమౌతుంది. ఆ వ్యక్తతత్వం కూడ లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అట్టి నీ తత్వం అలాంటిది ఇలాంటిదని వివరించడానికి వీలుకానిది. అదే అన్నిటికి మూలం. అన్నిటా అదే నిండి ప్రకాశిస్తుంటుంది. గుణాలకు అతీతమైనది. ఏకైక తత్త్వంగా నిలబడి ఉంటుంది. అది కాక వేరుగా శేషించినది ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే అది సర్వ క్రియా స్వరూపమైనది. వేదాలు ఆ తత్త్వాన్ని గురించే సర్వత్రా గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠిచి, దానికి ఆధారంగా నిలబడే జ్యోతి అది. అది నీవే. విశ్వేశ్వరా! సర్వమేళ్ళకి నిధానమా! లక్ష్మీదేవిభర్తవైన నీవు ఈ విశ్వాన్ని అంతటిని నీ లీలలతో ప్రవర్తింప జేస్తుంటావు. దానికి ఆధారమైన అవిద్య అనెడి మాయకు నీవు దగ్గరి బంధువవు. ఈ శాశ్వతమైన అనంతమైన కాలం యావత్తు నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకి. వాడే సమస్త శాశ్వతమైన లక్ష్మీకళలను, సుఖాన్ని, మృత్యుంజయాన్ని పొందినవాడు అవుతాడు. పద్మాక్షా! ప్రాచీనకాలం నుంచీ మహాయోగీశ్వరులు ఒంటరిగా యోగమార్గంలో అత్యంత తీవ్ర సాధన చేసి నిన్ను చూసాము అంటారు. కాని వారు చూసింది తాము చూడదలచిన రూపాన్నే కాని నీవు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు. నీవు దర్శన మిచ్చిన నీ ఈ రూపాన్ని భద్రంగా చూసి తరించాను ప్రభు. ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్యరూపాన్ని చూడడం కష్టంగా ఉంది. నీకు నమస్కరిస్తాను. సర్వస్వానికి ఆధారమైన ఈ నీ స్వస్వరూపాన్ని ఉపసంహరించు.
సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఈ సమస్తమైన విశ్వాన్ని కడుపులో దాచుకొన సమర్థుడవైన మహా నటుడవు. అలాంటి పరమ పురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ మాత్రమే కదయ్యా! నారాయణా! 
కమలదళాలలాంటి చక్కని కన్నులు గల ఓ ప్రభూ! నీవు నా కడుపున పుట్ట బోతున్నావని విని, దుర్మార్గుడు కంసుడు చాలాకాలంగా మమ్మల్ని ఇలా జైలులో పెట్టి బాధ పెడ్తున్నాడు. మలిన చిత్తంతో మసలుతున్న వాడిని శిక్షించు. భయభ్రాంతులము అయిన మమ్ము రక్షించు. నీ పుట్టుకతో మేము నోచిన నోములు అన్నీ లోటు లేకుండ పరిపూర్ణంగా పండాయి స్వామీ.” అని చెప్పుకొంది దేవకీదేవి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.